యశోద ఆస్పత్రిలో బాధితులకు కేటీఆర్ పరామర్శ

8
- Advertisement -

కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం, సోమార్‌పేట్ గ్రామానికి చెందిన బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూడా ఆయనతో కలిసి ఉన్నారు.

బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బిట్ల బాలరాజు, ఆయన కుటుంబంపై రాజకీయ కక్షతో కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ దాడిలో బాలరాజు, భారతి తీవ్ర గాయాలకు గురవ్వగా, మెరుగైన చికిత్స కోసం వారిని యశోద హాస్పిటల్‌కు తరలించారు.

హాస్పిటల్‌లో బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్, వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ భయపడదని, బాధిత కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైద్య చికిత్సకు అయ్యే అన్ని ఖర్చులు పార్టీనే భరిస్తుందని స్పష్టం చేశారు.

అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ వెంటే ఉంటుందని తెలిపారు.

Also Read:BRSLP సమావేశం 21కి వాయిదా

- Advertisement -