మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్‌పై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యంగా డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన ప్రశ్నించారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ “డీపీఆర్ లేదు” అని చెబుతుంటే, మంత్రి మాత్రం “డీపీఆర్ సిద్ధంగా ఉంది” అని చెప్పడం ఎలా సాధ్యమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రభుత్వం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో కాకుండా, ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమయ్యే ప్రజల మధ్యనే ప్రజెంటేషన్ నిర్వహించాలని తమ పార్టీ డిమాండ్ చేసిందని తెలిపారు. ఇదే కారణంగా ఆ ప్రజెంటేషన్‌కు బీఆర్ఎస్ సభ్యులు హాజరుకాలేదని స్పష్టం చేశారు.
మూసీ నదిని మురికి కూపంగా మార్చిందీ కాంగ్రెస్ పార్టీనేనని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ అసలు అభివృద్ధి కోసం కాదని, లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీ కోసం రూపొందించిందని విమర్శించారు. ఈ అంశంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ కూడా చేశారు.
బఫర్ జోన్ అంశంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 50 మీటర్ల బఫర్ జోన్ పేరుతో, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ ప్రాంతానికి కూడా నోటీసులు ఇవ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు ..1400 ఇళ్లు కూల్చివేస్తామని చెప్పగా, గెజిట్ ప్రకారం 10,000 ఇళ్లకు పైగా నోటీసులు జారీ చేయడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోందని అన్నారు.
Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేదల పట్ల ప్రేమ చూపిస్తున్నట్లు చెప్పినా, వాస్తవానికి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా, ఏడీబీ బ్యాంక్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు రుణం ఇవ్వలేదని, ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోయినా భారీ ఖర్చులతో ముందుకెళ్తోందని కేటీఆర్ ఆరోపించారు. మొత్తంగా, మూసీ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ప్రజల నమ్మకం పొందాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

