జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు, ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పదేండ్ల అభివృద్ధి, పాలనకి.. రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక.. పదేండ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్‌కు వెళ్ళేముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఈమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారు.లక్షల మంది రైతన్నలు ఈమె గెలుస్తుందని ఆశిస్తున్నారు. ఆ తర్వాతే తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు చూస్తున్నారు అన్నారు.
తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు చూస్తున్నారు… మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారు… కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదు. కేసీఆర్ గారు కట్టిన హైదరాబాద్‌లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయి అన్నారు.
కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారు…ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనార్టీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు… తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారు అన్నారు. దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు… మా అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతుందన్నారు.
Also Read:ఎన్నికల్లో పోటికి పీకే దూరం!

