తెలంగాణ రైతులకు కావాల్సిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సెప్టెంబర్ 9 లోపు ఇచ్చిన పార్టీ అభ్యర్థికే ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. ఇంతవరకు తమను ఏ కూటమీ సంప్రదించలేదని, అయితే తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎరువుల కొరతపై హైదరాబాద్ నందీనగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ అసమర్థత, అనుభవలేమి, ప్రణాళిక రాహిత్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైందని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఎరువుల కొరత రాలేదన్న కేటీఆర్, సీజన్ కు ఆరు నెలల ముందే 24 గంటల పాటు మానిటరింగ్ చేసి కేసీఆర్ ఎరువులను తీసుకొచ్చేవారని చెప్పారు. ఎరువులను కొందరు కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 70 లక్షల మంది తెలంగాణ రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఎలక్షన్లు, కలెక్షన్లు అని నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకుంటే క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తమకు ఢిల్లీలో బాస్ లు ఎవరూ లేరన్న కేటీఆర్, తెలంగాణ ప్రజలే తమకు బాస్ లని తెలిపారు. ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు పైసా ప్రయోజనం కలగడం లేదని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో నానా హంగామా చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ రైతుల యూరియా సమస్యపై పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. బీసీల మీద ప్రేమ నటించే కాంగ్రెస్ పార్టీ, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ నేతను ఎందుకు ప్రకటించలేదో చెప్పాలన్నారు.
గత రెండు నెలలుగా తెలంగాణలోని ఏ పల్లె చూసినా ఒక దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. ఎరువుల కోసం చాంతాడంత లైన్లో నిలబడి రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు. బురద చల్లడం తెలుసు. కాని ఒక్క పనికొచ్చే పని చేయడం మాత్రం తెలియదు చాతకాదన్న సంగతి ప్రజలకు స్పష్టంగా అర్థం అయింది.
ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకంతో ఒక్క బస్తా ఎరువు దొరక్క రైతులు ఆగమాగం అవుతున్నారు.
తాము పండించిన పంటను కొనండి అని అధికారుల కాళ్ళ మీద అన్నదాతలు పడే దుస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉంది..
ఎరువుల బస్తాల కోసం కూడా అధికారుల కాళ్ళ మీద రైతులు పడుతున్నారు..కాంగ్రెస్ పార్టీ చరిత్ర రైతులకు మేలు చేసింది ఏమాత్రం కాదు…ఆనాటి రోజులను మళ్ళీ తీసుకొస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులకు దుర్ధినాలను తీసుకొచ్చింది..యూరియా కోసం దుకాణాల ముందు మహిళా రైతులు రాత్రంతా పడిగాపులు పడే పరిస్థితికి తీసుకొచ్చింది…కెసిఆర్ గారి ప్రభుత్వంలో ఆరు నెలల ముందు నుంచే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేసేవాళ్ళం…ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ ను తీసుకొచ్చి గోదాముల్లో నిలువ చేసి ఇంకా సీజన్ స్టార్ట్ కాకముందే దేశంలో ఎక్కడెక్కడ యూరియా దొరుకుతుందో అక్కడి నుంచి తెప్పించి రైతులకు అందజేశాం. రైతుల కడుపులో సల్ల కదలకుండా ఇంటికి ఎరువుల బస్తాలు పంపాం. మేం అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న నాలుగు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యాన్ని ఒకటిన్నర సంవత్సర కాలంలోనే 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచాం అన్నారు.
ఇప్పుడు గోదాములు ఉన్నాయి, రైతు వేదికలు ఉన్నాయి, కష్టపడే రైతులు ఉన్నారు, కెసిఆర్ గారు ఎంతో కష్టపడి బాగు చేయించిన మిషన్ కాకతీయ చెరువులు ఉన్నాయి, అద్భుతంగా కట్టిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నీళ్లతో కలకలాడుతున్నాయి….కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఒక సమీక్ష, సన్నద్ధత, ప్రణాళిక లేకుండా ఉంది అన్నారు.

