రాష్ట్రంలోని పేదలు, ఆడబిడ్డలు, రైతులు, రాష్ట్ర బడ్జెట్ పట్ల ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ భట్టి విక్రమార్క గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత ఆరు గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది అన్నారు కేటీఆర్. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అనే మాటకు పాతర వేశారు అన్నారు. నెలకు 2500 రూపాయలు ఇస్తామని ఏ మహిళలకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇప్పుడు ఆ మహిళలంతా ఈ బడ్జెట్ను చూసి షాక్ అయ్యారు అన్నారు.
వంద రోజుల్లో 4000 రూపాయల పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన వృద్ధులకు నిరాశ మిగిలింది.. ఏ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీల గురించి బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ప్రస్తావించ లేదు అన్నారు. 6 గ్యారంటీలు నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి దేవుని ముంగట పెట్టి ఆ ఆఫిడవిట్లే తమకు భగవద్గీత తో సమానమని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి ఇప్పుడు ఆ హామీలకు పాతర వేశారు అన్నారు.
తుల బంగారం దిక్కులేదు. నెలకు 2500 రూపాయల మహాలక్ష్మి దిక్కులేదు. నెలకు 4000 రూపాయల పెన్షన్ ఊసే లేదు, కేసీఆర్ ప్రభుత్వంలో నేతన్నకు పెద్దపీట వేస్తూ చేనేతకు పెట్టిన బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు. కానీ ప్రస్తుత బడ్జెట్లో వారికి కేవలం 370 కోట్లు మాత్రమే కేటాయించారు అన్నారు. ఫ్రీ బస్సుతో ఓవైపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ వారికి హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి ఈ బడ్జెట్లో అతీగతి లేదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాళ్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నారు.
స్విగ్గి,జొమాటో లాంటి గిగ్ వర్కర్ల కోసం ఒక బోర్డు పెడతామని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు వారి గురించి కూడా ఒక మాట లేదు… 73% ఫిట్మెంట్ లొ కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తే వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చి వారి గురించి బడ్జెట్లో ఒక మాట కూడా చెప్పలేదు, పిఆర్సి గురించి కానీ పెండింగ్లో ఉన్న ఐదు డిఏ ల గురించి కానీ ఒక మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించలేదు అన్నారు.
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని దారుణంగా మోసం చేసింది..యాదవ సోదరులకు ఇస్తానన్న గొర్ల గురించి ఈ ప్రభుత్వం బడ్జెట్లో పట్టించుకోలేదు అన్నారు. వైన్ షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తానని గౌడ్ అన్నలకు ఇచ్చిన హామీని ఈ బడ్జెట్లో పట్టించుకోలేదు,నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో లేదు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రస్తావన లేదు అన్నారు.
నమ్మి ఓటేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది… పదేళ్ల ప్రగతి రథచక్రాన్ని పంచర్ చేసిన బడ్జెట్ ఇది అన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థతకు చాతకానితనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్.. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గట్టిగా పడ్డ పునాది కాంగ్రెస్ ఒక సంవత్సరం పాలనలోనే బీటలు వారిందన్నారు. ఆకాశం నుంచి పాతాళానికి ఆర్థిక వ్యవస్థ కూరుకుపోతున్నది. ఇందుకు కాంగ్రెస్ పార్టీని బాధ్యత తీసుకోవాలి.. ఆనాడు మేము సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ నేతలు రంకెలు వేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క సంవత్సరంలోనే 1,60,000 కోట్ల అప్పుచేసి ఒక్క కొత్త ప్రాజెక్టు ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించలేదు. మళ్లీ లక్షల కోట్ల అప్పుకు ఈ బడ్జెట్లో టార్గెట్ పెట్టుకున్నారు అన్నారు.
Also Read:బడ్జెట్ ప్రసంగమా?.. రాజకీయ ప్రసంగమా?

