హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీఆర్. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
భారీ వర్షాల వలన ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితుల కు అనుగుణంగా సహాయక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపడతామని తెలిపిన కేటీఆర్…. రోడ్ల పైన ఇల్లు లేక ఉండేవారు (హోం లెస్) వారిని వెంటనే జిహెచ్ఎంసి నైట్ షెల్టర్ లకి తరలించాలన్నారు. భవనాలు నిర్మిస్తున్న ప్రాంతాలను తనిఖీ చేసి, సెల్లార్ తవ్వకాల వలన ప్రమాదాలు జరగకుండా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాలం చెల్లిన శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి ప్రజలను వెంటనే బయటకు తీసుకు రావాలి. ఇందుకోసం అవసరమైతే పోలీస్ సహకారం తీసుకోవాలని సూచించారు. మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.