జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, “కాలికి బలపం కట్టుకొని తిరుగుతాం” అని కేటీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడ్డాయని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని, షేక్ పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంచి గెలిచారని, ఇది నైతిక గెలుపు కాదని విమర్శించారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా హరీష్ రావు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.
Also Read:పాంచ్ మినార్…క్రైమ్ కామెడీ!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని 407 బూతుల్లో ఒక్కో బూత్ కు 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, “ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి” అనే సామెతను గుర్తు చేస్తూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్, పార్టీ కార్యాలయాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

