సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేదా యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు.
గ్లోబేరినా బినామీ కంపెనీ అనడం, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం అని… అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శించిన కేటీఆర్.. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక జారీ చేశారు.

