రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇమేజ్ టవర్ నిర్మాణానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో రూ.946 కోట్ల అంచనా వ్యయంతో ఇమేజ్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇనార్బిట్ మాల్ సమీపంలో పది ఎకరాల స్థలంలో వంద మీటర్ల ఎత్తులో 16 లక్షల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మిస్తారు. ఎటుచూసినా టీ ఆకారంలో ఉండేవిధంగా భవన నమూనాను రూపొందించారు. ఈ టవర్‌లో ప్రధానంగా యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ పరిశ్రమలకు సంబంధించిన స్థలాలు కేటాయించే విధంగా నిర్మాణాలు చేపడుతారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించడానికి ఇప్పటికే బిడ్లను ఆహ్వానించారు. టీఎస్‌ఐఐసీ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.