కాళోజీ తెలంగాణ చైతన్య స్ఫూర్తి: కేటీఆర్‌

269
ktr

“ప్రజాకవి కాళోజి” బయోపిక్ సినిమా తీయడమన్నది సాహసంతో కూడుకున్న ప్రక్రియని, ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నవలా రచయిత, నంది అవార్డు గ్రహీత ప్రభాకర్ జైనీ అభినందనీయుడని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సారథ్యంలో జైనీ క్రియేషన్స్ నిర్మిస్తున్న “ప్రజాకవి కాళోజీ” బయోపిక్ సినిమాకు సంబంధించి బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు వందే మాతరం శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాళోజీ 106వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి సమర్పించే ఉద్దేశంతో ఒక వీడియో సాంగ్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాళోజీ తెలంగాణా చైతన్య స్ఫూర్తి. కళలకు కాణాచి అయిన వరంగల్ నుండి జయకేతనం ఎగురవేసి విశ్వమంతా ఖ్యాతినార్జించిన మహాకవి. తెలుగువారిలో సాహిత్య రంగంలో “పద్మ విభూషణ్” పొందిన ఏకైక వ్యక్తి కాళోజీ అని, కాళోజీ గారి మీద మన ముఖ్యమంత్రి కేసీయార్ గారికి అపారమైన గౌరవం ఉంది. అందుకే కాళోజీ నారాయణ రావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించామని, వరంగల్లులో కాళోజీ స్మారక సభా మందిరం నిర్మిస్తున్నామని. ప్రతీ సంవత్సరం కాళోజీ జన్మదినాన్ని “తెలంగాణా భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నామని, ఒక ప్రముఖ రచయితను కాళోజీ సాహితీ పురస్కారంతో సత్కరించుకుంటున్నామని అన్నారు. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉందని కేటీఆర్‌ కొనియాడారు.

సినిమా నిర్మాణం త్వరగా పూర్తయ్యి విడుదల కావాలని, ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా సినిమా యూనిట్ సభ్యులను మంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు కెమెరామెన్ గా రవికుమార్ నీర్ల పనిచేయగా, పాటలను రచయిత కళారత్న బిక్కి కృష్ణ రాయగా యస్. యస్. ఆత్రేయ సంగీతాన్ని అందించారు. కాళోజీ పాత్రలో మూలవిరాట్ అద్భుతంగా నటించారు. పీవీ గారి పాత్రలో వారి తమ్ముడు పీవీ మనోహర రావు నటించారు. వీరితో పాటు సినిమాలో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు నటించడంతో పాటు చిత్ర నిర్మాణానికి సహకరించారు.