ఈరోజు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ‘పింక్ బుక్- ఇన్వెస్టర్ గైడ్ టు తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక కారదర్శి జయేష్ రంజన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పుస్తకంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, రాష్ట్రంలో మౌలిక వసతులు తదితర అంశాలను పొందుపరిచి రూపొందించారు. పలు ప్రభుత్వ శాఖలు చేపట్టే కార్యకలాపాల వివరాలనూ వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. పెట్టుబడిదారులు వారి భవిష్యత్ పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకునేందుకు, రాష్ట్రంలో సులభతర వ్యాపారానికి పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆకాంక్షించారు. సులభతర వ్యాపార నిర్వహణలో భవిష్యత్‌లో దేశంలోనే తెలంగాణను అగ్రగామీగా నిలుపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. పింక్ పుస్తకంలో రాష్ట్రంలోని వివిధ రంగాలకు సంబంధించి ప్రభుత్వ విధివిధానాలతోపాటు ఉన్నతాధికారులు ఫోన్ నెంబర్లను సైతం ఉన్నాయని మంత్రి తెలిపారు.