నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం…

311
- Advertisement -

నేతన్నకు చేయూతను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భుదాన్ పోచంపల్లిలో  చేనేత కార్మికుల పొదుపు పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్  ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భుదాన్ పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే ఆదుకునేందుకు ఆనాటి ప్రభుత్వం ముందుకు రాకపోతే కేసీఆర్ జోలెపట్టి రూ. మూడున్నర లక్షలు ఇచ్చి ఆదుకున్నారో  అక్కడే ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.

అంతర్జాతీయ స్ధాయిలో చేనేతకు పోచంపల్లి కేరాఫ్‌ అన్నారు కేటీఆర్. పోచంపల్లి చేనేత కార్మికులకు అంతర్జాతీయ స్ధాయి గుర్తింపు ఉందన్నారు. బడ్జెట్‌లో చేనేత,జౌళి శాఖకు రూ. 1200 కోట్లు కేటాయించామన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా నూలు, రసాయనాలకు 50 శాతం సబ్సిడీతో ఇస్తామని తెలిపారు. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. క్షేత్రస్ధాయిలో నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ ఉద్యోగులు విధిగా సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని నిబంధన తీసుకొచ్చి ఆచరించి చూపిస్తున్నామని చెప్పారు.

 KTR Launches Chenethaku Cheyutha scheme

చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొత్త చేనేత క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. నేతన్నలు గౌరవంగా బ్రతికే పరిస్ధితి తీసుకొస్తామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కలిగించే విధంగా చర్యలు చేపట్టామని…..సినీ నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించామని చెప్పారు.

జపాన్ వెళ్లిన అమెరికా వెళ్లిన అక్కడి ప్రతినిధులకు ఇచ్చేది  చేనేత కార్మికులు నేసిన ఉత్పత్తులేనని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో ఏ నేత కార్మికుడికి  నెలకు రూ. 15 వేల రూపాయలు తగ్గకుండా వచ్చేలా చూస్తామన్నారు. పోచంపల్లి చేనేత పార్క్‌కు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. పోచంపల్లిలో శిల్పారామం లాంటి నేత బజార్‌ నిర్మిస్తామన్నారు. ఆధునిక హంగులతో నిర్మాణం చేపడతామన్నారు.

చేనేత,జౌళి రంగంపై జీఎస్టీని ఉపసంహరించాలని కేంద్రాన్ని గట్టిగా కోరానని చెప్పారు కేటీఆర్.  బహుముఖ వ్యూహంతో నేతన్నలకు చేయూతనందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. బడ్జెట్‌లో నేతన్నలకు కేటాయించిన ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు కేటీఆర్.

పథకం వివరాలు

-18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు(వీవర్స్, డైయర్స్, వెండర్స్, వార్పర్స్, సహాయ వీవర్స్) అందరూ ఈ పథకానికి అర్హులు.
-లబ్ధిదారుని వాటాగా వేతనంలో 8 శాతం పొదుపు పథకంలో జమ చేయాలి, ప్రభుత్వ వాటా 16 శాతం జమ చేయబడుతుంది(గరిష్టంగా రూ. 2,400ల వరకు జమ చేయబడుతుంది).
-నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, సంబంధిత సహాయ సంచాలకుల వారికి సమర్పించాలి.
-లబ్ధిదారుడు ప్రకటించిన నెలసరి వేతనంలో 8 శాతం ఆర్.డి-1 ఖాతాలో ప్రతి నెల 15వ తేదీలోగా జమ చేయాలి. ప్రభుత్వ వాటా 16 శాతం ఆర్.డి-2 ఖాతాలో జమ చేయబడుతుంది.
-36 నెలల(3సంవత్సరాలు) తర్వాత ఆర్.డి-1 మరియు ఆర్.డి-2 ఖాతాల్లో జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకోవచ్చు.
-తెలంగాణలో చేనేత వృత్తిపై ప్రత్యక్షంగా పని చేస్తున్న నేతన్నలందరికీ ఈ పథకం ద్వారా భవిష్యత్‌కు భద్రత కలుగుతుంది.

- Advertisement -