సిరిసిల్లలో రూ.5 భోజన పథకాన్ని ప్రారంభించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ పథకం అందుబాటులో ఉండగా దశల వారీగా జిల్లా కేంద్రాలకు విస్తారిస్తామన్న కేటీఆర్ అన్నమాటను నిలబెట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన కేటీఆర్ అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా పలువురికి వడ్డించిన కేటీఆర్ తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
తన పర్యటనలో భాగంగా నెహ్రూనగర్ లో వైకుంఠధామం, ఇందిరాపార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం పట్టణం శివారులో గుమ్‌షావలి దర్గాను సందర్శించారు. ఇప్పటివరకు కరీంనగర్,వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది.
దేశంలోనే మొదటిసారిగా 2014లో మార్చి 2న నాంపల్లిలోని సరాయిలో అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అత్యంత నాణ్యతతో, పోషకాహారంగా అందించారు. ఫలితంగా ప్రజల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో దశలవారీగా అన్నపూర్ణ క్యాంటీన్‌లను విస్తరిస్తూ ఇప్పటివరకు 140పైగా సెంటర్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు కోటి మందికి పైగా ఈ క్యాంటీన్లలో భోజనం చేశారు.
గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో సైతం కేటీఆర్ ఆకస్మిక తనిఖీ చేసి అన్నపూర్ణ క్యాంటీన్‌లో భోజనం చేశారు. అంతేగాదు 2017లో ప్రతిపక్ష నేత జానారెడ్డి సైతం 5 రూపాయల భోజన పథకాన్ని మెచ్చుకున్నారు.