సోమవారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గంభీరావుపేట మండలంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అదేవిధంగా గంభీరావుపేట మండలంలో తన సొంత నిధులతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం గంభీరావుపేట మండలంలో రూ. 2.26 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. గంభీరావుపేటలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి.. కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్యత తనది అని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థినుల కోసం హాస్టల్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు జ్యోతిబాపులే, అంబేడ్కర్ ఓవర్సీస్ కింద ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు.