హైదరాబాద్ మెట్రోలో మంత్రి కేటీఆర్..

45
- Advertisement -

వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న మంత్రి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఈరోజు మెట్రోలో ప్రయాణించారు. హెచ్ ఐ సి సి లో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించిన తర్వాత రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకు మెట్రోలో మంత్రి కేటీఆర్ ప్రయాణించారు

ఒక సాధారణ ప్రయాణికుడిగా మంత్రి కేటీఆర్ మెట్రోలో కనిపించడంతో ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. మంత్రి కేటీఆర్ తన 20 నిమిషాల ప్రయాణంలో పలువురితో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదువుతూ వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితోపాటు, ఇప్పటికే ఎంబిబిఎస్ కోర్స్ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జర్మనీతో సమానంగా బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరు పైన కేటీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న తీరు తనకు ఎంతో గర్వాన్ని ఇస్తుందని తెలిపారు.

జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినిలు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సంభాషించారు. మెడికల్ కోడింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని తమ స్నేహితులతో తెలుసుకొని, ప్రస్తుతం తమ శిక్షణ పూర్తి చేసుకునన్నామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తక్కువ మంది దృష్టి సారించే విభిన్నమైన మెడికల్ కోడింగ్ రంగంలో పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కేటీఆర్ ఆల్ ద బెస్ట్ తెలిపారు.

వీరితోపాటు పలువురు మహిళలు, వృద్ధులతో కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేరళకు చెందిన ఒక టూరిస్ట్ హైదరాబాద్ నగరంలో మూడు రోజులపాటు పర్యటిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరం నేను ఇంటర్నెట్ లో తెలుసుకున్న దానికన్నా గొప్పగా ఉన్నదని, ముఖ్యంగా నూతనంగా వచ్చిన అనేక కట్టడాలు, రోడ్లను చూస్తే ఒక విదేశీ నగరంలో పర్యటిస్తున్నట్లు అనిపించిందని ఆయన ప్రశంసించారు. నేను ఎవరో తెలుసా అని ఆ టూరిస్ట్ ని మంత్రి కేటీఆర్ అడిగినప్పుడు, మీరు ఎందుకు తెలవదు మాకు, ముఖ్యంగా తెలంగాణకు కిటెక్స్ పరిశ్రమ వచ్చినప్పుడు మీ గురించి విస్తృతమైన చర్చ మా రాష్ట్రంలో జరిగిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ సందర్భంగా పలువురు యువకులతో, యువతులతో కేటీఆర్ మాట్లాడారు. వారంతా తాము ఐటీ మరియు ఐటి అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న విషయాన్ని కేటీఆర్ కి తెలిపారు. 30వ తేదీన ఎన్నికలు ఉన్న విషయం మీకు తెలుసా అని ప్రశ్నించిన కేటీఆర్, మీలాంటి చదువుకున్న యువకులు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు కచ్చితంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఒక గంట సమయాన్ని ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు కేటాయిస్తే మరో ఐదు సంవత్సరాలపాటు మంచి నాయకులను ఎన్నుకోవచ్చని సూచించారు. 30వ తేదీన కచ్చితంగా ఓటు ప్రక్రియలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

రాయదుర్గం మెట్రో స్టేషన్ లో అడుగుపెట్టినప్పటి నుంచి బేగంపేట్ లో దిగే వరకు ప్రతి ఒక్కరు కేటీఆర్ ని ఆప్యాయంగా పలకరించి, ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఆయన గురించి, ఆయన పనితీరు గురించి, ఆయన చేసిన పలు కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు.

Also Read:CM KCR:మంచిర్యాలను మరింత అభివృద్ధి చేస్తాం

- Advertisement -