టాలీవుడ్ రచయిత కుటుంబానికి అండగా మంత్రి కేటీఆర్‌..

54

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనే కాదు.. సామాజిక అంశాల పట్ల అంకితభావంతో ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. జనం కష్టాలు సోషల్ మీడియా ద్వార తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు కేటీఆర్. చాలా మందికి నేను ఉన్నానంటూ అండగా నిలుస్తూ, తన మంచి మనసును చాటుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ సినీ గేయ రచయిత కందికొండ కుటుబాన్ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

తన తండ్రి చికిత్సకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందని, ఇప్పుడు తమ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని, ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ మంత్రి కేటీఆర్‌కు కందికొండ కూతురు మాత్రుక ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. చిత్రపురి కాలనీలో ఇంటి కోసం గతంలో తన తండ్రి రూ.4 లక్షలు కట్టారని, ఇప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని, చిత్రపురి కాలనీ లేదా వేరేచోట ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఆమె ఆ లేఖలో కోరారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలో అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇంటి విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తన ఆఫీసు అధికారులు సమన్వయం చేస్తారని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కాగా, ఆరు నెలల క్రితం కందికొండ ఆరోగ్యం విషమించడంతో కిమ్స్‌లో ఆయనకు ప్రభుత్వం తరఫున చికిత్స అందించారు.