హిందువులు పవిత్రంగా భావించే కుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తోంది యూపీ సర్కార్. జనవరి 15 నుండి జరిగే ఉత్సవాల కోసం ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించింది. కుంభమేళాకు రావాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందించారు ఆ రాష్ట్ర మంత్రి సతీశ్ మహానా.
కేటీఆర్‌ని కలిసిన సతీశ్ మహానా ఈ మేరకు ఆహ్వానపత్రికను అందజేశారు. 2019, జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు అలహాబాద్(ప్రయాగరాజ్)లో కుంభమేళా జరగనుంది.పుష్కరకాలంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఒక్కో ప్రాంతంలో కుంభమేళాను నిర్వహిస్తారు. పుష్కరం పూర్తయ్యాక మహాకుంభమేళాను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పవిత్ర గంగా స్నానాల కోసం తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లుచేస్తోంది యూపీ సర్కార్. ఇక పుష్కరాల సమయంలో జనవరి నుంచి మార్చి వరకు మూడునెలలపాటు పెండ్లిళ్లు తదితర సామూహిక కార్యక్రమాలను జరుపుకోరాదని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.