సిర్పూర్ మిల్లుకు పూర్వ వైభవమే లక్ష్యంగా..

247
KTR for FICCI
KTR for FICCI
- Advertisement -

ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్దరణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలుస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఉద్యమకాలం నుంచి సిర్పూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన పేపర్ మిల్లు పునరుద్దరణ దిశగా మరో ముందడుగు పడిందన్నారు. ఇప్పటికే ఈ పేపర్ మిల్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో వివిధ కంపెనీలతో ప్రభుత్వం విస్తృతంగా చర్చలు నిర్వహిస్తుందని తెలిపారు. కేవలం సిర్పూర్ పేపర్ మిల్లు మాత్రమే కాదు అవకాశం ఉన్న ప్రతీ ఖాయిలా పరిశ్రమను పునరుద్ధరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు కేటీఆర్. అయితే ఈ రోజు పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు, అటవీ శాఖ మంత్రి జోగురామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కూడిన ప్రత్యేక బృందం కోల్ కత్తా వెళ్లింది.

unnamed

వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమయింది. సిర్పూర్ పేపర్ మిల్ పునరుద్దణకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రుల బృందం హామి ఇచ్చింది. మరోవైపు తాము ఇప్పటికే ఈ నెల ఏడు తారీఖున సిర్పూర్ పేపర్ మిల్ ను పరిశీలించామని, పునరుద్దరణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని వెస్ట్ కోస్ట్ కంపెనీ యాజమాన్యం తెలిపింది. తమ ప్రాథమిక పరిశీలన తర్వాత తదుపరి చర్చల కోసం మంత్రులను స్వయంగా కోల్ కత్తాకు ఆహ్వానించిన నేపథ్యంలో ఈ రోజు మంత్రుల బృందం, కంపెనీ ఎండీ & ఛైర్మెన్ ఎస్.కె బంగూర్ ను కలిశారు. ఒక ఖాయిలా పడిన పరిశ్రమను పునరుద్దరించేందుకు తెలంగాన ప్రభుత్వం చూపుతున్న చొరవ పట్ల హర్షం వ్యక్తం చేసిన బంగూర్, త్వరలోనే ఐడిబీఐ బ్యాంకు బృందంతో కలిసి తమ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో తదుపరి చర్చలు జరుపుతారన్నారు. మంత్రుల బృందంతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు.

unnamed (1)

కోల్ కత్తాలో ఉన్న ప్రముఖ పెట్టుబడిదారులతో మంత్రి కెటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి వివరించిన కేటీఆర్, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా ఐటీ, ప్లాస్టిక్, కెమికల్స్, మౌలిక వసతులరంగంలో పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయమైన గమ్యస్థానమన్నారు.ముఖ్యంగా ఐటీ రంగంలో ఆఫ్టిక్ ఫైబర్ తయారికి ముందుకొచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ తో ఇవ్వనున్న ఇంటింటికి ఇంటర్ నెట్ కార్యక్రమం అద్భుత అవకాశమన్నారు. ఈ సమావేశానికి కోల్ కత్తాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. తెలంగాణలో పర్యటించేందుకు త్వరలోనే ఒక ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామని తెలిపారు.

- Advertisement -