కేటీఆర్‌కు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం

3
- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. బ్రిటన్‌లో జరిగే ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సుకి రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్ ను ఆహ్వానించింది. మే 30, 2025న లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్ ను ముఖ్య వక్తగా పిలుస్తూ, బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీ ఆహ్వాన లేఖ పంపారు.

2023లో ఇదే కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న కేటీఆర్ ప్రసంగం, ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయని ప్రతీక్ తెలిపారు. ఈసారి కూడా లండన్ వ్యాపార వర్గాలు, ఇండో-యూకే కారిడార్లోని ముఖ్య వ్యక్తులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్‌ను కలవడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి అమితమైన ఆసక్తి చూపిస్తున్నారన్నారు. దీంతో తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానిస్తున్నామని ప్రతీక్ దత్తానీ ప్రత్యేకంగా లేఖలోప్రస్తావించారు.

ఈ కార్యక్రమానికి హాజరైతే భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచుకునే అవకాశం కలగడంతో పాటు, ఇంగ్లాండ్ వ్యాపార సముదాయానికి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఏర్పడే అవకాశం ఉందని ప్రతీక్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిజీ షెడ్యూల్‌లో కొంత సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి హాజరైతే తమకెంతో ఆనందంగా ఉంటుందన్నారు.

‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సుకి భారత్-బ్రిటన్ వ్యాపార రంగ ప్రముఖులు, పాలసీ మేకర్లు, తెలుగు ప్రవాసులు సహా 900 మందికి పైగా ప్రముఖులు హాజరవుతారు. ఈ వేదికలో భారత ఆర్థిక ప్రగతి, విదేశీ పెట్టుబడుల అవకాశాలు, వాణిజ్య సంబంధాల పురోగతి వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. కేటీఆర్ తన పర్యటనలో బ్రిటన్ పారిశ్రామికవేత్తలు, తెలుగు ప్రవాసులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

Also Read:మద్రాస్ హైకోర్టుకు కునాల్ కామ్రా!

- Advertisement -