కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్‌సైట్ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారని.. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్ అధికారం ఇచ్చారా?. అలా అయితే ఆయన దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలన్నారు. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన కేటీఆర్ ధీటుగా బదులిచ్చారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, అసంబద్ధంగా ఉన్నాయన్న కేటీఆర్.. తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నారు. నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న పోలీసుల నైతికతను ప్రశ్నించే అర్హత దిగ్విజయ్‌కు లేదన్నారు. తెలంగాణ పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే, తెలంగాణ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ హెచ్చరించారు.
దిగ్విజయ్ తన ట్వీట్లలో పేర్కొన్న అంశాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఖండించారు. బాధ్యతాయుతమైన సీనియర్ నాయకుడు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం వల్ల దేశవిద్రోహ శక్తులతో పోరాడుతున్న పోలీసుల నైతిక స్థైర్యం, వారి పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని అనురాగ్ శర్మ అన్నారు.