తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం యువతలోని సృజనాత్మకతను వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్‌క్యుబేటర్ ‘టీ-హబ్’ (T-Hub) ను ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ‘అనుముల హబ్స్’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. లాంటి పెట్టుబడి లేకపోయినా (జీరో ఇన్వెస్ట్‌మెంట్) ‘టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్’ అనే కంపెనీని స్థాపించి, రాత్రికి రాత్రే రూ. 200 కోట్ల లాభం సంపాదించిన ఘనత కొండల్ రెడ్డిది. ఈ వినూత్న వ్యాపార సూత్రానికి గాను ఆయనకు ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డు ఇవ్వాలి అని కేటీఆర్ విమర్శించారు.
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా పొందాలో ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటో వివరించాలి. యువత కూడా ఆ సూత్రాన్ని పాటిస్తారు అని డిమాండ్ చేశారు.
కనీస నిబంధనలు పాటించకుండా, ఎలాంటి ప్రశ్నలు తలెత్తకుండా ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా సొంతం చేసుకోవాలంటే “అనుముల బ్రదర్స్‌లో ఒకరై ఉంటే చాలు” అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వజనపక్షపాతం, భూ కేటాయింపుల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:పెద్ద మనసుతో క్షమించండి:జానీ మాస్టర్

