ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ మంత్రి కే తారకరామారావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగయ్య వేదం సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది ప్రేక్షకులను కదిలించారాన్నారు. ఆ తర్వాతి కాలంలో ఆయన ఇబ్బందులలో ఉన్నప్పుడు స్వయంగా కలిశానని… ఆ సందర్భంలో ఆయనతో జరిగిన ఆత్మీయ సంభాషణను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నాగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.
కాగా,సినిమాల్లో నటించినప్పటికీ నాగయ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేకపోయారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. అలాగే, మా అసోసియేషన్ నెలకు రూ.2,500 పింఛన్ ను ఇప్పించింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, నాగయ్యది గుంటూరు జిల్లా, నరసరావుపేట సమీపంలోని దేసవరం పేట గ్రామం. సొంత గ్రామంలో పని దొరకకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్కు వచ్చారు.
అల్లు అర్జున్ నటించిన ‘వేదం’ సినిమాలో శ్రీను అనే బాలుడికి రాములు తాత పాత్రలో నటించి, ఆ సినిమాలో బన్నీతోనూ తాత అని పిలుపించుకున్న నాగయ్య పేరు ముందు ‘వేదం’ ఇంటి పేరులా మారిపోయింది. ఆ సినిమాతోనే ఆయన అందరి దృష్టిని ఆకర్షించి వరుసగా మరిన్ని సినిమా అవకాశాలు పొందారు. దాదాపు 30కి పైగా సినిమాలలో నటించారు. లీడర్, నాగవల్లి, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ వంటి సినిమాలు ఆయనకు మరింత గుర్తింపు తెచ్చాయి. పాత్రలో ఒదిగిపోయి, నటించడమే కాకుండా అందులో జీవిస్తారన్న పేరును సంపాదించుకున్నారు నాగయ్య.