నిరుద్యోగులపై లాఠీఛార్జ్ హేయమైన చర్య!

4
- Advertisement -

దిల్‌సుఖ్‌నగర్ లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీఛార్జ్ చేయించడాన్ని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రతీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలననా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు అన్ని యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా పలు రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ‘మెగా నోటిఫికేషన్లు’, ‘జాబ్ క్యాలెండర్’ అంటూ కోతలు కోసి, నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకి పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కేవలం 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడటం అన్యాయమన్నారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టుగా వెంటనే 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో హక్కుల కోసం పోరాడిన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అరెస్టయిన ప్రతి ఒక్క నిరుద్యోగ బిడ్డను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని ఆయన హెచ్చరించారు.

Also Read:ఫ్రెంచ్ వ్యాపారవేత్తలకు పీయూష్ ఆహ్వానం

నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ మరియు వయోపరిమితి సడలింపు వంటి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే, నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి అండగా బిఆర్ఎస్ ఉంటుందన్నారు.

- Advertisement -