రేవంత్ రెడ్డి ప్రభుత్వం పచ్చి దళిత, గిరిజన వ్యతిరేకి అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ శతాబ్దపు అతిపెద్ద అబద్ధం కాంగ్రెస్ మ్యానిఫెస్టో… రేవంత్ ప్రభుత్వ చేతిలో తెలంగాణలోని అన్ని వర్గాలు మోసపోయాయి అన్నారు. ఖర్గే సాక్షిగా చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలుచేయకుండా రేవంత్ దళిత, గిరిజనులను దగా చేశాడు అన్నారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచే సత్తా లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ పాలనలో తెర్లు అయిన తెలంగాణను మళ్లీ బాగు చేసుకోవాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎంతో ముందు చూపుతో అంబేద్కర్ గారు పెట్టిన ఆ ఆర్టికల్ కారణంగానే తెలంగాణ కల సాకారం అయింది…. బోధించు, సమీకరించు, పోరాడు, అన్న బాబాసాహెబ్ బాటలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఉద్యమించారు అన్నారు.
లక్షలాది మందిని సమీకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధించి, ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు కేసీఆర్ కొట్లాడితే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ వచ్చింది… ఆ మహనీయున్ని గౌరవించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నాము. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమున్నతంగా గౌరవించుకున్నాము అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కరే. అంబేద్కర్ ను అంత గొప్పగా గౌరవించుకున్న ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరూ లేరు… దళితుల జీవితాల్లో అద్భుతమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో లక్షలాది దళితులకు మేలు చేయాలన్న సంకల్పంతో దళిత బంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. దళిత బంధు పేరుమీద కేసీఆర్ రూ.10 లక్షల మాత్రమే ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామని చేవెళ్లలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పనుల్లో 26% శాతం ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. దళిత, గిరిజనులు ఇండ్లు నిర్మించుకుంటే ఆరు లక్షలు ఇస్తామని ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆరు పైసలు కూడా ఇవ్వని సిగ్గులేని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అన్నారు.
ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారు… రెండుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న కారణంగా మొన్న రైతుబంధు వేశాడు. అరకొరగా రైతుబంధు వేసి సంబరాలు చేసుకోమంటున్న దిక్కుమాలిన ప్రభుత్వం ఇది… కేసీఆర్ రైతులకు రూ.10,000 ఇస్తే తాము రూ.15000 ఇస్తామన్నారు. ముసలి వాళ్లకు ఇస్తున్న 2 వేల పెన్షన్ ను రూ.4000 చేస్తామన్నారు… కేసీఆర్ ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నాడు తాము అధికారంలోకి వస్తే ఇద్దరికీ ఇస్తామన్నారు. అత్తకు 4,000, కోడలు 20,000 ఇస్తామన్నారు. కాని అధికారంలో వచ్చాక ఈ హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలుచేయడం లేదు… రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 50 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంటే దాన్ని చివరకు రూ.12 వేల కోట్లకు కుదించి అది కూడా సగమే చేశారు… ఆడబిడ్డలకు తులం బంగారం, నెలకు 2,500 రూపాయలు ఇవ్వడం లేదు. వడ్లకు బోనస్ ఇస్తామని అన్ని బోగస్ మాటలు చెప్పారు అన్నారు.

