కరీంనగర్ నుండి ఎన్నికల శంఖారావన్ని పూరించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ ఎస్‌ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్ 16 లోక్‌సభ స్ధానాల్లో టీఆర్ఎస్‌ని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చొవాలో టీఆర్ఎస్ నిర్ణయించే స్థాయికి ఎదగాలని సూచించారు.
కరీంనగర్ జిల్లాకు రైలు, నిధులు రావాలన్నా..టీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సినవసరం ఉందని, ఇందుకు ప్రజలు టీఆర్ఎస్‌ని ఆశీర్వదించాలని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ పార్టీలకు గడ్డు పరిస్థితులే ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయన్నారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని, కేసీఆర్‌ను మరోసారి సీఎం చేశారని గుర్తు చేశారు. 2001లో మే 17వ తేదీన ఎస్ఆర్ కళాశాల మైదానంలో మా తెలంగాణ మాకు కావాలి అని గర్జించారని, కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాకు రైల్వే అనుమతులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ఇతర రాష్ట్రాలు ఈ పథకాలను ప్రవేశ పెడుతున్నాయన్నారు.
2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో తెలంగాణ బిడ్డగా తాను ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. ఐదేళ్లకాలంలో మోడీ ఎలాంటి పనులు చేయలేదన్నారు. దీనిని గుర్తించిన ప్రజలు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ గుణపాఠం చెబుతున్నారని తెలిపారు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా మోడీ సానుకూలంగా స్పందించలేదన్నారు.