తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ పూర్తిగా దెబ్బతిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీస ప్రయోజనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందంటే అది ప్రభుత్వ ఆర్థిక మిస్మేనేజ్మెంట్‌కు నిదర్శనమని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని, వాటికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, తెలంగాణను ఒక ఏటీఎంలా మార్చి కాంగ్రెస్ పెద్దలకు సమర్పించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
అయితే ఇప్పుడు మూడో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పటికీ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, “రైతులకు వెన్నుపోటు – రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు” అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. అలాగే “రాహుల్ బంధు కాదు, రైతు బంధు కావాలి” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
Also Read:2027 వరల్డ్ కప్ గెలవడమే టార్గెట్!
పెన్షన్లు పెంచుతామని చెప్పి మాట తప్పారని, పేదవారి నడ్డి విరిచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. “మహాలక్ష్మి పథకం మాట మరిచారు, మహిళలను నట్టేట ముంచారు” అంటూ నిరసన వ్యక్తం చేశారు. శాసనసభలో, శాసన మండలిలో ప్రతి పేదవాడి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనతో గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

