సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనతో తెలంగాణ ఆగమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో బీఆర్ఎస్ దార్శనిక పాలనకు, దద్దమ్మ కాంగ్రెస్ పాలనకు ఉన్న స్పష్టమైన తేడా, నాలుగు కోట్ల సమాజం ముందు బట్టబయలు కావడంతో ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవం, పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టిన ప్రగతి పథం.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా పదిలమని కేటీఆర్ అన్నారు. కేవలం వెబ్‌సైట్ నుంచి రిపోర్టులను తొలగించినంత మాత్రాన, చేయని తప్పునకు అధికారులపై వేటు వేసినంత మాత్రాన.. తెలంగాణ పదేళ్ల ముఖచిత్రాన్ని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన స్వర్ణయుగాన్ని చెరిపేయడం ఈ ముఖ్యమంత్రి వల్లే కాదు.. ఢిల్లీ పార్టీ ముత్తాతలకు కూడా సాధ్యం కాదని చెప్పారు.
14 నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చాలదన్నట్టు, ఇప్పుడు అధికార యంత్రాంగంపై కూడా వేధింపులకు దిగడానికి సీఎంకు సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు. వాస్తవ గణాంకాలను జీర్ణించుకోలేక, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ చిల్లర చేష్టలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
Also Read:కేసీఆర్.. మహాశివరాత్రి విషెస్