ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధు అమలులో పాల్గొనండి- కేటీఆర్‌

64

సీఎం,పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెసిఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ వివిధ అంశాలకు సంబంధించి సమగ్ర చర్చ జరిగిందని టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కే టీ రామారావు తెలిపారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీన మంచి మూహూర్తంలో ఢిల్లీలో 1200 చదరపు మీటర్ల స్థలంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ భూమి పూజ కార్యక్రమం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ భూమి పూజ ఉంటుంది. ఈ కార్యక్రమానికి చట్ట సభల్లోని టీఆర్ఎస్ ప్రతినిధులు,రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఆహ్వానితులుగా ఉంటారు అని కేటీఆర్‌ అన్నారు.

సెప్టెంబర్ 2వ తేదీనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కమిటీల నిర్మాణం- వార్డు కమిటీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మండల- మున్సిపల్- పట్టణ- జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్ మాసంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.పార్టీ సంస్థాగత నిర్మాణం సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం పూర్తి కానుంది. ఈ సంవత్సరంలోనే నవంబర్ లేదా అక్టోబర్ చివరిలోనో ద్విదశాబ్ది ఉత్సవ సభ నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన ఉందని కేంద్రమే చెప్తుంది. సిద్దిపేటలో దళితజ్యోతి ప్రారంభించిన కేసీఆర్ అదే స్ఫూర్తితో దళితబంధు పథకం తెచ్చారు. దళితబంధు పథకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. మరో రెండు రోజుల్లో కేకే ఆధ్వర్యంలో కమిటీ సమావేశం ఉంటుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కమిటీ సమావేశంలో రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత హుజురాబాద్ ఎన్నిక గురించి చర్చ జరుపుతాం. హుజురాబాద్ ఉప ఎన్నికను మిగతా ఉపఎన్నికలను చూసినట్టుగానే చూస్తామన్నారు.ఇన్ని సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్నాం.. కొంతమందికి హుజురాబాద్ ఎన్నిక అత్యంత ప్రాధాన్యత గలది కావొచ్చు మాకు మాత్రం చిన్నదే అని కేటీఆర్‌ అన్నారు..కొంతమంది దళితబంధు విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు..కెసిఆర్ ది బలహీనమైన గుండె కాదు.. దైర్యంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టే దళిత బంధు పథకం తెచ్చారు. పనికిమాలిన ప్రతిపక్షాలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టిన దళితబంధు పథకం అమల్లో పాల్గొనండి అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఎపుడు ఏ పథకం అమలు చేయాలో ప్రభుత్వానికి తెలుసు..హుజురాబాద్ చిన్న ఉపఎన్నిక.. హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు…కేంద్రంలో ప్రభుత్వం మారేది లేదు. హుజురాబాద్‌లో దళితబంధు సక్సెస్ అయితే దేశం తెలంగాణను చూస్తది. హుజురాబాద్ టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట.. ఈటెలకు ముందు కూడా పాత కమలాపూర్ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ బలంగా ఉంది..ఈటెల రాజేందర్ 2003లో టీఆర్ఎస్‌లో చేరారు.అప్పటికే అక్కడ స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది..జిల్లా పార్టీ కార్యాలయాలను అక్టోబర్‌లో విజయదశమికి అటు ఇటుగా ప్రారంభిస్తామన్నారు.