తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం- మంత్రి కేటీఆర్

90
ktr

ఈరోజు సింగరేణ్ కోల్ మైన్స్ బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కెంగర్ల మల్లయ్యకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ వెంకటేశ్ లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ లోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. కెంగర్ల మల్లయ్య మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని అన్నారు. 13 నుంచి 14 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా, మరో 15 నుంచి 20 నియోజకవర్గాల్లో పరోక్షంగా సింగరేణి కార్మికుల పాత్ర ఉందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కార్మికులతో కలిసిపోవాలని అన్నారు. సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ ఇచ్చిన ప్రతిఒక్క హామీని నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఇవాళ రాష్ర్టంలో కొంత‌మంది కొత్త‌బిచ్చ‌గాళ్లు వ‌చ్చారు.. నిన్న మొన్న ప‌ద‌వులు వ‌చ్చినోళ్లు ఎగిరెగిరి ప‌డుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద‌పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు. ఒకాయ‌న గుంజుకోవాలంటాడు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిడితేనే పెద్ద నాయ‌కుల‌మైపోతామ‌నే చిల్ల‌ర ఆలోచ‌నా విధానాన్ని మానుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. కేసీఆర్‌ను గెల‌వాలంటే.. కేసీఆర్ కంటే ఎక్కువ‌గా తెలంగాణ‌ను ప్రేమించడం నేర్చుకోవాలి. కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణ‌కు ఏమ‌న్న చేయ‌గ‌ల‌మ‌న్న విశ్వాసాన్ని క‌ల్పిస్తే.. ఏదో రెండు ఓట్లు రాలుతాయి. త‌ప్ప ఏం సాధించ‌లేరు. కేసీఆర్‌ను తిట్టంగ‌నే ఒక శున‌కానందం, పైశాచిక ఆనందం పొంద‌డం తాత్కాలిక‌మేన‌ని కేటీఆర్ అన్నారు.

మీరు త‌ల‌ప‌డుతున్న‌ది ఆషామాషీ నాయ‌కుడితో కాదు.. నిర్విరామంగా పోరాటం చేసి, కేంద్రం మెడ‌లు వంచి తెలంగాణ‌ను సాధించిన నాయ‌కుడితో పోరాడుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో వైఎస్సార్, చంద్ర‌బాబు, కిర‌ణ్ కుమార్‌రెడ్డితో పాటు పులువ‌రిపై ధీరోధాత్తంగా కేసీఆర్ పోరాడారు. జాతీయ స్థాయిలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఏకం చేసి తెలంగాణ‌ను కేసీఆర్ తీసుకొచ్చారు అని కేటీఆర్ గుర్తు చేశారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు దుబ్బాక‌లో, జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు ఎక్కువ గెల‌వంగానే ఎగిరెగిరి ప‌డ్డారు. ఆ త‌ర్వాత జ‌రిగిన సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఆ త‌ర్వాత జ‌రిగిన మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఓట‌మి పాలైంది. అన్ని ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి, రాష్ర్ట ప్ర‌జ‌లు కేసీఆర్‌పై త‌మ‌కున్న అభిమానాన్ని చూపించారు. ఈ రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే కేవ‌లం కేసీఆర్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఓటుకు నోటు కేసులో చంచ‌ల్‌గూడ జైలుకు వెళ్లిన రేవంత్.. మ‌ళ్లీ అవే నోట్ల క‌ట్ట‌ల‌తో పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కొనుక్కున్నాడ‌ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలే అంటున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణ‌ను గుంజుక‌కోవడం సాధ్యం కాదు. కేసీఆర్ పేరు ఉచ్చ‌రించే అర్హ‌త కూడా లేదు. టీఆర్ఎస్ లేక‌పోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్ వ‌చ్చేవా? అని ప్ర‌శ్నించారు. వీళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంటే గంజిలో ఈగ లాగా తీసి అవ‌త‌ల ప‌డేద్దురు. కోతికి కొబ్బ‌రిచిప్ప దొరికిన‌ట్టు.. గింతంతా ప‌ద‌వి దొరికింది. ఆ ప‌ద‌వికి ప్ర‌క‌ట‌న‌లు, ర్యాలీలు తీసిండ్రు.. అవ‌న్నీ చేసుక్కో.. కానీ పిచ్చి పిచ్చి మాట‌లు మాట్లాడొద్ద‌ని రేవంత్‌ను హెచ్చ‌రించారు. రాజ్యాంగంలోని ప‌దో షెడ్యూల్ ప్ర‌కారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మ‌రి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన‌ప్పుడు ఎందుకు రాజీనామా చేయ‌లేదు అని రేవంత్‌ను ప్ర‌శ్నించారు. రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు రాజ్యాంగ‌బ‌ద్ధంగా చేరారు. మ‌రి రాళ్ల‌దాడి వారిపై కూడా చేయాలా? రాజీనామా చేయ‌ని మిమ్మ‌ల్ని కూడా రాళ్ల‌తో కొట్టాల్నా? బ‌జారు భాష మాట్లాడే నాయ‌కుల‌ను ప‌ట్టించుకునే అవ‌స‌రం మ‌న‌కు లేద‌ని కేటీఆర్ అన్నారు.