గౌతమిపుత్ర శాతకర్ణి అందించిన జోష్‌తో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు బాలకృష్ణ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101గా తెరకెక్కుతున్న పైసా వసూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించాడు బాలయ్య.
తమిళ కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ గరువారం ఉదయం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. బాలయ్య మంచి మాస్ లుక్‌లో నడుముకి టవల్ కట్టుకుని తొలి షూట్‌లో పాల్గొన్నారు.
సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార నటిస్తోండగా…. ఎం.రత్నం కథ, మాటలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గతంలో నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి స్వరాలు సమకూర్చిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.
నేటి నుంచి 30 రోజులపాటు రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్ జరగనుంది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బి. గోపాల్, క్రిష్, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ పాల్గొన్నారు.