ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు..

142
- Advertisement -

కృష్ణపట్నం ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుపై రకరకాల వార్తలు బయటికొస్తున్నాయి. ఈ మందును రోడ్డుపక్కన బడ్డీ కొట్టుల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారం అస్తవ్యస్తంగా తయారైంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణ కోసం తయారు చేస్తున్న మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య అన్నారు.

మందు పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ… సరైన స్పందన రాలేదని చెప్పారు. మందు తయారీకి సరైన సామగ్రి సమకూరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అందుకే మందు తయారీలో వెనుకబడ్డామని తెలిపారు. అయినా పలువురు దాతలు అందిస్తున్న సహకారంతో ప్రజలకు మందును అందిస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా మందును అందిస్తున్నామని తెలిపారు.

బడ్డీ బంకుల్లో తమ మందును అమ్ముతున్నారని… అది ప్రభుత్వ లోపమేనని ఆనందయ్య అన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బాధితులందరికీ కరోనా మందును ఉచితంగా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధుల ద్వారా మందును అందజేస్తున్నామని తెలిపారు. ఏయే జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయో… ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

- Advertisement -