భారతదేశంలో 80శాతం నీటిని వ్యవసాయనికే వినియోగిస్తున్నారని అన్నారు కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డ్ ఛైర్మెన్ ఆర్.కే. గుప్తా. హైదరాబాద్ లోని హోటల్ మారియట్ లో 24వ హైడ్రో 2019 అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డ్ ఛైర్మెన్ ఆర్.కే. గుప్తా హాజరయ్యారు. హైడ్రాలిక్స్, నీటి వనరులు, తీర ప్రాంత ఇంజనీరింగ్ నైపుణ్యత తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.
ఈసందర్భంగా కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డ్ ఛైర్మెన్ ఆర్.కే. గుప్తా మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పుల వల్ల కరువులు, వరదలు సంభవిస్తున్నాయన్నారు. తద్వారా నగరాల్లో నీటి సరఫరాలు తగ్గిపోయి వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయంలో మార్పులు రావాలి వరితో పాటు, ఇతర పంటలపై దృష్టిసారించాలి. భారతదేశంలో 80శాతం నీటిని వ్యవసాయనికే వినియోగిస్తున్నారు అదే అమెరికాలో 40శాతం మాత్రమే వినియోగిస్తున్నారు. ఇజ్రాయిల్, సింగపూర్, పశ్చిమ అమెరికాలో నీటి పునర్వినియోగం ఎక్కువగా జరుగుతుందని ఆదిశగా అన్ని దేశాలు ఆలోచన చేయాలి అన్నారు.