తెలంగాణలో భూముల తాకట్టు వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 817.32 ఎకరాల భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకుందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను ప్రెస్‌మీట్ పెడతానంటే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని అసలు అంశం నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
‘క్రిశాంక్ కృష్ణలీలలు’ అంటూ తనపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎలాంటి లీలలు లేవని, కాంగ్రెస్ నాయకుల వ్యవహారాలను తాను బయటపెడతానని హెచ్చరించారు. ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా తాను భయపడబోనని, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో మొత్తం 817.32 ఎకరాల భూములను తాకట్టు పెట్టిందని క్రిశాంక్ ఆరోపించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇజ్జత్‌నగర్ (శేరిలింగంపల్లి)లో 26 ఎకరాలు, మొకిలాలో 41 ఎకరాలు, మియాపూర్‌లో 105 ఎకరాలు, ఇస్నాపూర్‌లో 27 ఎకరాలు, ఇంజాపూర్‌లో 22 ఎకరాలు, చిలుకూరులో 49 ఎకరాలు, పఠాన్‌చెరులో 17 ఎకరాలు, గాజులరామారంలో 44 ఎకరాలు, జవహర్‌నగర్‌లో 484 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు పేర్కొన్నారు.
రూ.200 కోట్ల విలువ చేసే ఎకరం భూమిని కేవలం రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు తాకట్టు పెట్టడం ద్వారా రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు.
హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతాలో 2026 మార్చి 31 నాటికి కేవలం రూ.275 కోట్లు మాత్రమే ఉన్నాయని క్రిశాంక్ పేర్కొన్నారు. అయితే, జూన్ 30 నాటికి అదే ఖాతాలో రూ.10 వేల కోట్లు జమ అయ్యాయని తెలిపారు. ఈ మొత్తాన్ని భూములను తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పుగా అభివర్ణించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూముల తాకట్టు, అప్పుల వివరాలు, నిధుల వినియోగంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని క్రిశాంక్ అన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇతర అంశాలను తెరపైకి తీసుకురావడం వల్ల అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
Also Read:జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు..కేటీఆర్ దిశానిర్దేశం
