ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక దిపోత్సవం వైభవంగా సాగింది.దీపారాధనకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.కోటి దీపోత్సవానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా స్వామివారు గరుడవాహనంపై ఊరేగారు. కార్తీక సోమవారం కావటంతో ఎన్టీఆర్ స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. కైలాసాన్ని తలపించే విధంగా ఏర్పాట్లుచేశారు.
కోటి దీపోత్సవం అద్భుత కార్యక్రమం..
కార్తీక పౌర్ణమి రోజు దీపాలంకరణ చేయటం మన సంస్కృతిలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పంచారామానికికు వెళ్లకుండానే ఇక్కడే దర్శనం చేసుకునే భాగ్యాన్ని ఎన్టీవీ చౌదరి కల్పించారని అన్నారు. ఇటువంటి చక్కని కార్యక్రమాలను దీక్షతో పట్టుదలతో అంకితభావంతో ఏర్పాటుచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కోటి దీపోత్సవంలో పాల్గొన్న వారందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం. కోటి దీపోత్సవం అద్భుత కార్యక్రమమని కొనియాడారు. ఎంతో ఆధ్యాత్మిక భావాలుంటే తప్ప కోటి దీపోత్సవం సాధ్యం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రి సుజనా చౌదరి, దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
వరంగల్‌లోని సుప్రసిద్ధమైన వేయి స్తంభాల ఆలయం లక్షదీపాల వెలుగులతో కాంతులీనింది. కార్తీక పౌర్ణమి వేడుక సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు వేయిస్తంభాల ఆలయానికి చేరుకొని లక్షదీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నిండు పౌర్ణమి వేళ.. వేయిస్తంభాల ఆలయం మహిళలతో కిక్కిరిసిపోయింది. ఆలయం చుట్టూ ప్రాంగణంలో లక్షదీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. దీప కాంతుల మధ్య ఆలయం శోభాయమానంగా వెలిగింది.