సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగాలి..

194
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఏజన్సీని, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. అనంతరం పరిహారం పెంపుపై రిలే దీక్షలు చేస్తున్న అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. మీరు కోర్టును ఆశ్రయించారని, తీర్పు రాగానే తగు చర్యలు తీసుకుంటామని, ప్రాజెక్టు ప్రాదాన్యతను గమనించి సహకరించాలని సూచించారు.

అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఎల్ అండ్ టి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 3480 కోట్లతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. ప్రాజెక్టుకు 40 కిమి కుడి కాలువ, 56 కిమి ఎడమ కాలువ ఉంటుందని, గోదావరికి అనుబంధ వాగులుకు రక్షణ బండ్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. 36.5 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యముతో నిర్మిస్తున్న ఈ బ్యారేజీకి 65 గేట్లు ఏర్పాటు చేయనున్నామని, ఒక్కో గేట్ 15/15 మీటర్లు ఎత్తు ఉంటాయని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు నీటి ద్వారా సీతారామ ఎత్తిపోతల పధకానికి వినియోగిస్తామని, ఈ నీటి ద్వారా మన జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 6.45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు చెప్పారు.

ప్రాజెక్టుకు అవసరమైన 3123 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 510 ఎకరాలు సేకరణ జరిగిందని, రానున్న 5 రోజుల్లో 1205 ఎకరాలు ఇరిగేషన్ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన గ్రావెల్, మెటల్, ఇసుక అనుమతుల ప్రక్రియ రానున్న జనవరి 26వ తేది వరకు పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు అవసరమైన 322 ఎకరాల సీఏ భూమి జనవరి 10వ తేదీ వరకు గుర్తించి ప్రతిపాదనలు అందచేయాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.

రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని చెప్పారు. నిర్వాహసితులకు నగదు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేయాలి. నేరుగా నగదు చెల్లింపులు చేయొద్దు. 500 ఎకరాలు ఇవ్వడం జరిగిందని, కేవలం 2 శాతం మాత్రమే పనులు జరగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు జరగడం లేదని వేగవంతం చేయాలని ఆదేశించారు. భూ సేకరణ సమస్య లేదని చెప్పారు. ఏదేని సమస్య ఉంటే తక్షణమే తన దృష్టికి తేవాలని ఎల్ అండ్ టి అధికారులకు సూచించారు. 6 నెలల క్రితమే 500 ఎకరాలు భూమి ఇచ్చామని, 7 కిమి బండ్ నిర్మాణానికి ఇచ్చామని అన్నారు.

ఇసుక అనుమతికి ప్రతిపాదనలు పంపాలని, టీఎస్ ఎమ్ఎన్డిసి పిఓ ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. ఆధారిటి సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక అధికారిని కేటాయించాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఎటువంటి జాప్యాన్ని నివారించేందుకు జనవరి 10వ తేదీన ర.భ, పీఆర్, అటవీ, ఉద్యాన, ఎక్సయిజ్, ఎన్పిడీసీఎల్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సీఈ ఇర్రిగేషన్‌కు సూచించారు.

సీతమ్మ సాగర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమని సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్లను, మైనింగ్, ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రానున్న వర్షాకాలం వరకు బండ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. పనులు వేగవంతానికి అవసరమైన మెటీరియల్, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పధకం మూడు పంప్ హౌస్ లు సిద్ధం అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటేశ్వర రెడ్డి, ఈ ఈలు శ్రీనివాస రెడ్డి, రాం ప్రసాద్, బాబు రావు, ఎల్ అండ్ టి డిజిఎం రాజేష్ చౌహన్, అశ్వాపురం, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం తహశీల్దార్లు సురేష్, ప్రసాద్, నాగేశ్వరరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -