కొంగరకలాన్ ప్రాంతం తెలంగాణ ప్రజలకోసం ఎదురుచూస్తోంది. మరికొన్ని గంటల్లో ఆ ప్రాంతం 25 లక్షల జనసంద్రంతో నిండిపోనుంది. ఈరోజు (ఆదివారం) టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్యర్వంలో ‘ప్రగతి నివేదన సభ’ జరగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సిటీ అంతా…గులాబీమయంతో గుబాలిస్తోంది.
ఇప్పటికే కొంగరకలాన్ వైపు తెలంగాణ ప్రజల అడుగులు మొదలయ్యాయి. సభ వైపునకు వెళ్ళే దారులన్నీ..జన జాతరను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి జనం ఉప్పెనలా తరలివస్తున్నారు.
బస్సులు, ఇతర వాహనాలు ప్రగతి నివేదన సభ బాట పట్టాయి. ఇవాళే సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి 2000 ట్రాక్టర్లలో రైతన్నలు ప్రగతి నివేదన సభకు నిన్న బయలుదేరారు.
ఇక …ప్రగతి నివేదన సభకు కామారెడ్డి జిల్లా రైతులు ట్రాక్టర్లలో తరలిరానున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు 100 ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరనున్నారు. మంత్రి పోచారం జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించనున్నారు.
కాగా..ప్రగతి నివేదన సభకు 25 లక్షల మందికి పైగా తరలిరానుండగా.. సభకు తరలివచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే వారి కోసం 9 మార్గాలు, 14 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ట్రాఫిక్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.