పరకాల నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మంత్రి కొండా సురేఖ దంపతుల కూతురు కొండా సుస్మిత తన రాజకీయ అరంగేట్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తాను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తాను అంటూ సుస్మిత స్పష్టం చేశారు.
కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం పరకాల నుంచే ప్రారంభమైందని గుర్తు చేసిన సుస్మిత, “నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. పరకాల నియోజకవర్గం నా అడ్డా. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతాను” అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమని వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ, “సుస్మిత నాకంటే ధైర్యవంతురాలు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఎంతటివారినైనా ఎదుర్కొనే సాహసం ఆమెకు ఉంది. ప్రజల కోసం కష్టపడే తత్వం ఆమెకు చిన్ననాటి నుంచే ఉంది” అని చెప్పారు. తన కూతురికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం
పరకాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సంక్షేమం తన ప్రధాన లక్ష్యాలని సుస్మిత తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే తన లక్ష్యమని సుస్మిత స్పష్టం చేశారు. అయితే ఇక్కడి నుండి కాంగ్రెస్ తరపున రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే.

