తెలంగాణ రాజకీయంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై కొండా సురేఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అలాగే పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఆరోపణలు చేస్తూ ఆమె మీడియాతో మాట్లాడారు.
సురేఖ ఉంటే నేను ఉండను అని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్ చేశారని ఆయన బెదిరింపుల వల్లే తనను పదవి నుంచి తొలగించారని కొండా సురేఖ ఆరోపించారు. అధిష్ఠానానికి తనను తీసేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం తనతో మాట్లాడకుండానే బర్తరఫ్ చేశారని అన్నారు. సీఎస్ ద్వారా గవర్నర్‌కు పంపిన లేఖలో లెటర్‌హెడ్ కానీ సంతకం కానీ లేవని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి సోదరులు (తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మరియు మాజీ టీడీపీ నాయకులు కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. నా కూతురు మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ కనిపించలేదు. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం ఏంటి?” అని ప్రశ్నించారు.
డి.శ్రీనివాస్ (DS) ఇంట్లో రెండు పార్టీలు లేవా? కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీగా గెలిపించుకోలేదా? అని నిలదీశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నారు.”నన్ను టార్గెట్ చేసి చిన్నారెడ్డిని బలి చేయడం సరికాదు. నా ఉసురు తగలకుండా పోదు. దేవుడున్నాడు, అన్ని చూస్తున్నాడు అని మండిపడ్డారు కొండా సురేఖ.
Also Read:BSP:ఒంటరిగానే బరిలోకి

