ఏదైనా ఒక పార్టీ నేత తన పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణమే. కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలపై ప్రశంశలు కురిపించినప్పటికి సొంత పార్టీని తక్కువ చేసేంతలా మాట్లాడడం చాలా అరుదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా కాదు సొంత పార్టీ నేతలే ఆ పార్టీ పక్కలో బల్లెంలా మారారు. ఇంతకీ విషయమేమిటంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ పార్టీ విజయంపై సొంత నేతలకే నమ్మకం కుదరడం లేదు. ఇటీవల మీడియా చిట్ చాట్ లో తెలంగాణ కాంగ్రెస్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ” ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్తూ కాంగ్రెస్ కు గెలుపు కష్టమే అనేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. .
కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పడం పార్టీని దిగజార్చడమే అని చెబుతున్నారు. ఈసారి కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అగ్రనేత రాహుల్ గాంధీ వరుస యాత్రలు, విపక్షలను ఏకం చేసేలా ఇండియా కూటమి.. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విజయంపై కన్నెసింది. ఈ నేపథ్యంలో పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా సొంత పార్టీ నేతలే గెలుపు కష్టం అనేలా వ్యవహరించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొదట కాంగ్రెస్ నేతగానే ఉన్నప్పటికి ఆ తర్వాత మునుగోడు బైపోల్ సమయంలో బీజేపీ గూటికి చేరారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రిపదవి కోసం అరటపడుతున్నారు. మరి అలాంటి నేతకు కాంగ్రెస్ విజయంపై నమ్మకం కుదరకపోవడం చర్చనీయాంశం అయింది. అయితే గతంలో బీజేపీలో ఉన్న కారణంగా ప్రస్తుతం కాషాయ పార్టీకి కోవర్ట్ లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారా ? అని సొంత పార్టీనేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం అభిప్రాయమే అయినప్పటికీ ఇతర కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.