మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు షోకాజ్ నోటిసులు ఇచ్చింది క్రమశిక్షణ కమిటి. అధిష్టానం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా మోదీ లాంటి వ్యక్తులు తెలంగాణకు అవసరం అని చెప్పారు. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఆయన యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాకు రాజకీయ జన్మనిచ్చిందంటూ వ్యాఖ్యానించారు. పార్టీ బాగు కోసమే ఉత్తమ్ , కుంతియాలపై వ్యాఖ్యాలు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్టీ ప్రక్షాళన జరగాలని తాను కోరారని తెలిపారు.
అయితే, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని షోకాజ్ నోటీసులు ఇచ్చారని.. కానీ, అధిష్టానం తనపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అంటూ ఓ కార్యకర్తతో ఆయన ఫోన్‌ల్లో సంభాషించిన ఆడియో కూడా వైరల్ అయ్యింది. అయితే రాజగోపాల్ రెడ్డి దూకుడును గమనించిన బీజేపీ నేతలు ఆయన చేరికకు నో చెప్పారని తెలుస్తుంది.