తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 29ప నల్లగొండ జిల్లాలో ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని, అటువంటి ప్రాంతంలో వేరే నేత సమీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలం లేని ప్రాంతాల్లో సమావేశాలు పెట్టుకుంటే మంచిదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హితవు పలికారు.
తన సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, తాను వాటిలో పాల్గొన్నాల్సి ఉన్నదని చెప్పారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చే అంశంపై తమ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కార్యాచరణ ప్రకటిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సాధారణమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.