సికింద్రాబాద్‌లో డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ కార్యాలయంలో ఆసంస్థ రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్, డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ కే వెంకట్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రక్తదాన శిబిరంతో పాటు ఉచిత నేత్ర పరీక్షా కేంద్రాన్ని నిర్వహించారు.
సంస్ధ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో శుభపరిణామమని దీనిని అంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు కోలేటి దామోదర్. ఇటువంటి అద్భుత కార్యక్రమాలకు రూపకల్పన చేసిన కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అధికారులను ప్రశంసించారు.
తెలంగాణను హరిత తెలంగాణగా రూపొందించడానికి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారని ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ఒకటని పేర్కొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ రూపొందించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని కేంద్రమంత్రులు,గవర్నర్లు,మాజీ గవర్నర్లు,హైకోర్టు న్యాయమూర్తులు,సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారని చెప్పారు. ఇప్పటికే మూడు కోట్లకు పైగా మొక్కలు నాటారని తెలిపారు.
చెట్లను నాటడం ద్వారా ఆనందం,ఆహ్లాదం మనకు లభిస్తాయని చెట్లు పర్యావరణాన్ని రక్షిస్తాయని, మనం నాటిన చెట్లు మనకు పండ్లను,కాయగూరలను అందించి రుణం తీర్చుకుంటాయని చెప్పారు.మన పిల్లల నుంచి మనం ప్రతిఫలం ఆశించలేమని అయితే చెట్లు మాత్రం మనకు ప్రతిఫలాన్ని వెంటనే ఇస్తాయని చెప్పారు. రక్షణశాఖకు ఖాళీ భూములు ఉన్నాయని ఆ స్ధలాల్లో చెట్లను నాటి వాటికి తమ తల్లిదండ్రుల పేర్లు, పిల్లల పేర్లు పెట్టుకుని ప్రేమతో పెంచాలని పిలుపునిచ్చారు.