ధర్మశాల టెస్టుకు కోహ్లి దూరం..

167
Kohli out of Test, Australia bat first

సిరీస్ ఫలితాన్ని శాసించనున్న ధర్మశాల టెస్టుకు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ కీలకమైన ఈ టెస్టుకు దూరమయ్యాడు.  కోహ్లి స్థానంలో రహానే కెప్టెన్ గా బాధ్యతలను నిర్వహించనున్నాడు. కోహ్లీ స్థానంలో కుల్ దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు.

మరోవైపు, పేసర్ ఇశాంత్ శర్మ స్థానంలో భువనేశ్వర్ కుమార్ కు స్థానం దక్కింది. ఈ మ్యాచ్ లో ఆడతాడనుకున్న మహ్మద్ షమీకి చోటు దక్కలేదు. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు.

రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. టీమ్‌ఇండియా సాధన సందర్భంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు దూరమైన విరాట్‌ భుజానికి పెద్ద బ్యాండేజీతో మైదానంలోకి వచ్చాడు. ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా అతడు కాసేపు అండర్‌ ఆర్మ్‌ త్రోలు మాత్రమే సాధన చేశాడు. ఆ తర్వాత ఫిజియోతో సుదీర్ఘంగా చర్చించాడు. భుజంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకే అతడు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు దూరమయ్యాడని అనుకున్నారు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లి ప్రయత్నించాడు.

ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు స్వదేశంలో అద్భుత ఆటతీరుతో.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించి అజేయంగా నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును కూడా ఇదే కోవలోకి చేర్చాలనే కసితో విరాట్‌ సేన ఉంది. అయితే 1-1తో సిరీస్‌ సమంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లి లేకపోవడం.. భారత్‌కు కొంత ప్రతికూలతేనని క్రీడా నిపుణులు అంటున్నారు.

ఇక మూడో టెస్టులో భారత్‌ విజయావకాశాలను సమర్థంగా అడ్డుకున్న ఆస్ట్రేలియా జట్టు ఫుల్‌ జోష్‌లో ఉంది. నైతికంగా తామే గెలిచామనే భావనతో చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. 2004 అనంతరం భారత గడ్డపై ఓ టెస్టు సిరీస్‌ను దక్కించుకోవడంతో పాటు వరుసగా మరోసారి ఈ ట్రోఫీని గెల్చుకోవాలని ఆసీస్‌ ఉవ్విళ్లూరుతోంది.