ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై ఆయన కూతురు విజయలక్ష్మీ స్పందించారు. మా కుటుంబలో ఎలాంటి గోడవలు లేవని స్పష్టం చేశారు విజయలక్ష్మీ. చనిపోయిన మనిషిపై ఇలా పుకార్లు చేయడం మంచిది కాదన్నారు. ఆయన వయస్సుకు అయిన గౌరవం ఇవ్వాలని కోరారు. దయచేసి ఆయనపై తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకున్నారు.
ప్రభుత్వం లేని పోని కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపించారు. నిత్యం కూతురు, కోడుకు అంటూ కేసులు పెడుతూ వేధించడంతో మానసికంగా ఎంత నరకం అనుభవిస్తూ.. ఎంత బాధపడ్డారో తమకు తెలుసని అన్నారు. కనీసం ఇప్పుడైనా.. ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండంటూ రోదిస్తూ వేడుకుంది.
మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండన్న ఆమె కన్నీరు పెట్టుకుంది. ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిపై వేధింపులు ఎక్కువయ్యాయని, ఆయనకు మూడు నెలలుగా కంటిపై కునుకు లేకుండా వేధించారని ఆరోపించారు. కాగా నిన్న ఉస్మానియ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ముగిసిన అనంతరం కోడెల పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు. నేడు తన సొంత గ్రామం నరసరావుకు పేటకు కోడెల పార్ధివదేహాన్ని తరలించనున్నారు.