ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్లతో గెలుపొందింది. శుక్రవారం (రేపు) చెన్నైతో ఫైనల్స్‌లో తలపడనుంది కేకేఆర్. 136 పరుగుల స్వల్ప లక్ష్యం…ఓపెనర్లే 96 పరుగులు జోడించి గెలుపు దిశగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.
ఇక ఢిల్లీ పని అయిపోయింది అని అంతా అనుకునేలోపే మ్యాజిక్ జరిగింది. 25 బంతుల్లో 13 పరుగులు చేస్తే కేకేఆర్ విజయతీరాలకు చేరుతుంది. కానీ 7 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కొల్పోయి చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో త్రిపాఠి సిక్సర్‌తో నైట్ రైడర్స్‌ను గెలిపించి శభాష్ అనిపించుకున్నారు. దీంతో కోల్‌కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది.
అంతకముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.