సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ

6
- Advertisement -

హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో మెట్రో రెండో దశ నిర్మాణానికి అవసరమైన చర్యలపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలసి హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం అంశంపై విస్తృతంగా చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

మెట్రో మొదటి దశకు సంబంధించిన అన్ని లావాదేవీలు పూర్తయిన తర్వాతే రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం అధికారిక చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులను నియమించాలని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారుల పేర్లను త్వరితగతిన పంపించాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా, ప్రస్తుతం L&T ఆధ్వర్యంలో ఉన్న ‘మెట్రో నెట్‌వర్క్’ను ముందుగా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని లేఖలో పేర్కొన్నారు. అవసరమైన అనుమతులు, ఆర్థిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్ నగర వేగవంతమైన అభివృద్ధి దృష్ట్యా, మెట్రో రెండో దశ పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు.

Also Read:‘కనుమ’..ఎందుకు జరుపుకుంటారు?

- Advertisement -