బండి వర్సెస్‌ కిషన్ రెడ్డి.. బీజేపీలో వర్గపోరు..!

90
- Advertisement -

సీఎం కేసీఆర్ కు మేమే ప్రత్యామ్నాయం, టీఆరెస్ ను గద్దె దించుతామని ఉపన్యాసాలు దంచే తెలంగాణ బీజేపీని వర్గపోరు ఊపిరాడకుండా చేస్తోంది. వడ్ల కొనుగోలుపై టీఆరెస్ ఉద్యమ బాట పట్టడంతో…. ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బండి సంజయ్ పైకి హడావిడి చేస్తూ తమను లెక్క చేయడం లేదని ఆ పార్టీ సీనియర్లు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. ఉన్న నలుగురు ఎంపీలకు నాలుగు గ్రూపులు అన్న పేరుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి, బండి సంజయ్ కు ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నది పార్టీలో ఓపెన్ సీక్రెట్. బండి సంజయ్ కార్యక్రమాలకు కిషన్ రెడ్డి వీలైనంత దూరంగా ఉంటారు అని పార్టీలో అందరికి తెలిసిందే.

టీఆరెస్ దూకుడును ఆపే ప్రయత్నంలో భాగంగా బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. ఈ యాత్రకు కిషన్ రెడ్డి వర్గం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే పార్టీకి వచ్చే మైలేజ్ దేవుడెరుగు.. ఉన్న కాస్త పరువు కూడా పోతుందని, ఇదే అదునుగా కేసీఆర్ అండ్ టీం నుండే వచ్చే విమర్శలకు సమాధానం కూడా చెప్పుకోలేమని తటస్థంగా ఉండే నేతలు మదన పడుతున్నారు.

కేసీఆర్ రైతు ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లే సమయంలో ఇక్కడ మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా కుప్పిగంతులే అవుతాయని బీజేపీ క్యాడరే కామెంట్ చేస్తోంది. ఇక తెలంగాణలో బీజేపీ బలపడుతుందని, అమిత్ షా నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ పైనే అంటూ కొంత కాలంగా బీజేపీ ప్రకటన చేస్తూ వస్తుంది. అమిత్ షా ఏకంగా క్యాంప్ ఆఫీసు తెరవబోతున్నారని కూడా బీజేపీ ప్రచారం చేసుకుంది. ఇక నుండి నెల వారీగా రాష్ట్రంలో పార్టీ కోసం ఆయన వస్తారని, అందులో భాగంగా ఏప్రిల్ నెలాఖరుకు జనగామలో భారీ బహిరంగ సభ ఉంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

కానీ, అమిత్ షా మాత్రం బీజేపీ నేతల తీరు, రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పెద్దగా సంతృప్తితో లేరని, అందుకే రాష్ట్రానికి రావాలని వచ్చిన విజ్ఞప్తిని పక్కన పెట్టినట్లు సమాచారం. పైగా ఇటీవల ఢిల్లీ పర్యటనలో గవర్నర్ ఇచ్చిన సీక్రెట్ నివేదికలో సైతం బీజేపీ బలం పుంజుకోవడం కన్నా కాంగ్రెస్ బలపడుతుంది అని ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంటే గతంలో బీజేపీ నేతగా ఉన్న తమిళ సై కి కూడా ఇక్కడ బీజేపీ బలపడలేదు అని తేల్చేశారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓ వైపు గ్రూపులు… పాత నేతలు, కొత్త నేతల తలనొప్పులకు తోడు ఇప్పుడు అమిత్ షా హ్యాండ్ ఇవ్వడం బీజేపీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తుంది. కేసీఆర్ వాగ్దాటికి తట్టుకొని నిలబడే నాయకత్వం లేకపోవటంతో పాటు నేతలంతా తలోదారిలో పయనిస్తున్న ఈ సందర్బంలో బీజేపీని ఎవరు అదుకుంటారో అని క్యాడర్ మదనపడుతోంది.

- Advertisement -