కాంగ్రెస్ గూటికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

247
Kirankumar Reddy
- Advertisement -

ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఊమెన్ చాందీ,ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు పలువురు ముఖ్యనాయకులు పాల్గొననున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్ధాపించారు.

కానీ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలపడిపోయింది. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వెలువడ్డాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన సొంతగూటికి రావడానికే మొగ్గుచూపారు.

హైదరాబాద్ నిజాం కాలేజీ,ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీకాం,ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. నిజాం కాలేజీ విద్యార్ధి సంఘం నాయకుడిగా పనిచేశారు. ఏపీ తరపున రంజీలకు ప్రాతినిధ్యం వహించిన కిరణ్ కుమార్‌ రెడ్డి కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. కిరణ్ కెప్టెన్సీలో అజారుద్దీన్ కొన్నిమ్యాచ్‌లను ఆడారు.

తండ్రి అమరనాథరెడ్డి చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన కిరణ్ కుమార్ రెడ్డి 1989 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2010లో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -