మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యానికి శారీరకశ్రమ ఎంతగానో ఉపకరిస్తుందన్నది తెలిసిన విషయమే. టీవీ చూడటం, కంప్యూటర్ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.
అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవటంపై అంతగా దృష్టి పెట్టలేదు. దీనిని గుర్తించటానికే బ్రిటన్ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు.
అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసుకున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారిలో మానసిక సమస్యలు సుమారు 60 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా ఉంటున్నాయి.
Also Read:పవన్ ‘OG’ పై క్రేజీ కామెంట్స్
టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరక శ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.
Also Read:మహేష్ ఆమె వైపు, త్రివిక్రమ్ ఈమె వైపు