అశేష భక్తజన సందోహం నడుమ ఖైరతాబాద్ బడాగణేషుడి నిమజ్జనం ముగిసింది. గణపతి బప్పా మోరియా….అగ్‌లె బరస్ తూ జల్దీ ఆ, జైబోలో గణేష్ మహరాజ్ కీ జై…అంటూ భక్తి పారవశ్యంతో ట్యాంక్ బండ్ ప్రాంతాలు మారుమ్రోగాయి. డప్పు వాయిద్యాలు, యువత కేరింతల నడుమ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో బై బై అంటూ గణేషుడుకి వీడ్కోలు పలికారు. పోటెత్తిన జనంతో నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు, పిల్లలు, యువత అందరూ లయబద్ద నృత్యాలతో రంగులు చల్లుకుంటూ ఊరేగింపులు ఆసాంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.
శోభాయాత్రకు ఉదయమే భారీ ఎత్తున పూజలు చేశారు. కలశపూజ చేసి విగ్రహాన్ని వాహనంపైకి చేర్చారు. ప్రధాన విగ్రహంతో పాటు బాలాజీ, గోవర్థనగిరి ఘట్టాలు ముందుకు సాగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు మీరాటాకీస్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ట్యాంక్‌బండ్ చేరుకుంది. గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా గణనాథులు ట్యాంక్‌బండ్ దిశగా బయలుదేరారు. సిటీ మొత్తం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.